* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారి మెగా కన్వెన్షన్ సావనీర్–2022 పుస్తకంలో చోటు దక్కించుకున్న కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Content

మా ఊరు






PDF ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్లిక్ చేయండి.!  

మా 'రేమల్లె' పల్లె - మాకు సెంటు మల్లె

        “ప్రపంచంలో అన్నింటికన్నా వేగంగా పరిగెత్తేదేమిటి.?” అని పాఠశాలలో మాష్టారు అడిగారో రోజు.  సింహం, చిరుతపులి, జింక, కరెంట్ అని ఏవేవో చెప్పాం. ఆయన నవ్వేసి ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తేది మన మనస్సని చెప్పారు. అప్పుడు అర్ధం కాలేదుకాని స్వగ్రామాన్ని వదిలిలా సిటీలో ఉంటుంటే అడుగడుగునా మనస్సు అక్కడికి పరిగెడుతుంటే తెలిసింది. ఏదైనా దగ్గరున్నప్పుడు కన్నా దూరమైనప్పుడే దాని విలువ తెలుస్తుంది. లేడికి లేచిందే పరుగులా ప్రతి కొత్త అనుభవానికి ‘ఇదే మా ఊళ్ళో అయితేనా’ అనే ఊతపదం నోటివెంట వచ్చేస్తుంటే ఎంతలా మనసు లోతుల్లోకి జీర్ణించుకుపోయిందో అర్ధమైంది. మా ఊరు పేరు కొత్త రేమల్లె. నాన్న గోవర్ధనరావు, అమ్మ రంగమ్మ, శ్రీమతి స్వప్న. సుమారు వంద గడపలున్న చాలా చిన్న గ్రామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం తాలూకా గన్నవరం నియోజకవర్గం, రేమల్లె గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్నది.

ఊర్లో ఎవరింటికెళ్ళినా వరుసలతో ఆత్మీయ బంధాలను కలిపేసేవాళ్ళే. ఆ ప్రేమాభిమానాలు ఈ సిటీలో దొరక్క, ఒకరినొకరు నమ్మే పరిస్థితి లేక మా ఊరు పదేపదే గుర్తొస్తూ ఉంటుంది. ఒకసారి ఏమయ్యిందంటే రెండు ఇళ్ళ మధ్య చిన్నచిన్న తగాదాలొచ్చి గొడవ పడుతుంటే గోడమీద పిల్లిలా అలా చూస్తూ ఉన్నా. ఆవేశంలో ఒకరు విసిరిన కర్ర నా తలకి తగిలి బాగా రక్తం వచ్చింది. హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. అక్కడితో ఆ రెండిళ్ళ మధ్య గొడవ మాసిపోయి నాకు దెబ్బతగిలిన విషయం పెద్ద టాపిక్ అయ్యింది. వారి తగాదాల గురించి ఎవ్వరూ ఆరా తీయలేదుకాని హాస్పిటల్ కొచ్చి నన్ను ఆత్మీయంగా పలకరించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇకమీదట జరగకూడదని గ్రామ పెద్దలంతా నిర్ణయించుకుని పార్లమెంట్ సభ్యులు కావూరి సాంబశివరావు నిధులతో కమ్యూనిటీ భవనాన్ని నిర్మించారు. ఆ కమ్యూనిటీ భవనం నావల్లే కట్టారని నాకెంతో గర్వంగా ఉంటుంది. అందుకే అదంటే నాకు ఎనలేని ప్రేమ.

సంక్రాంతికి కోడి పందేలతోనూ, హరిదాసులతోనూ, విజయదశమికి ఆలయాల భజనలతోనూ, దీపావళికి దివిటీలతోనూ, టపాసులతోనూ, వినాయక చవితికి ఇంటింటికి తిరుగుతూ అందరి ఇళ్ళల్లో ముసిని కాయలు, పల్లేరు కాయలు, పరిగి విసురుకుంటూ, క్రిస్టమస్ కు ప్రార్ధనల కూటములతో మా పిల్లల గ్యాంగ్ హడావుడి మామూలుగా ఉండేది కాదు. సాధారణంగా పగటి వేషగాళ్ళు వివిధ వేషాలలో దర్శనమిస్తూ సంభావనలు స్వీకరిస్తారు. కాని మా ఊరికి మాత్రం నాలుకకు పెద్ద సువ్వ (తీగ/దబ్బలం) పెట్టుకుని, భయపెట్టే రాక్షస వేషం వేసుకుని వచ్చేవారు. ఓసారి పగటి వేషగాడు వస్తే మేమూ ఒంటి చుట్టూ ఆకులు దోపుకుని వాడి వెనకే వెళ్లాం. చర్నాకోలుతో ఒళ్లంతా కొట్టుకుంటూ అతను తిరుగుతుంటే మేమూ అలాగే చేయాలని చర్నాకోలు దొరక్క దూడలకు కట్టిన తాడులు ఊడదీసి మెళ్ళో వేసుకుని వెళ్లాం. ఆ తాడులు ఊడదీయడంతో అవి గేదల దగ్గరికి వెళ్లి పాలు మొత్తం తాగేసేవి. ఇక చూస్కోండి వెనక మా పేరెంట్స్ కర్రలు పట్టుకుని వస్తుంటే, విషయం తెలీక అతన్ని తరమడానికి వస్తున్నారేమోనని ఆ పగటి వేషగాడు పరిగెత్తాడు. వాళ్లకి దొరకకూడదని ఎవరికి దొరికిన సందుల్లోకి వారు లగేత్తాం. సాయంత్రందాకా ఇంటిమొహం చూడలేదంటే నమ్మండి. ఇక హరిదాసులు వస్తే ఆ భజన భలేగుండేది. అతనిలాగా భుజాన తంబూర వేసుకునే వెసులుబాటు లేక ఎండిన తాటాకు, మూరెడు కర్రపుల్ల తీసుకుని అతని వెనకే కర్రపుల్లతో తాటాకును వాయించుకుంటూ వెళ్ళేవాళ్ళం. మా అల్లరి భరించలేక గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసేవాళ్ళు.

ఎన్నోసార్లు కోడిపందేలు దగ్గరుండి ప్రత్యక్షంగా చూడాలని తెగ ప్రయత్నించేవాడిని. వాళ్ళేమో చిన్నపిల్లల్ని కోడి పందాల దగ్గరికి రానిచ్చేవారు కాదు. రాయబారాలు నడిపినా పనవ్వలేదు. నాకు కోపం వచ్చేసింది. మా గ్యాంగ్ ను తోడ్కొని కోడి పెట్టలను పట్టుకుని కోడి పందాలు జరుగుతున్న చోటుకెళ్ళి పుంజుల దగ్గర పెట్టలను వదిలిపెట్టి పరిగెత్తాం. పెట్టల్ని చూశాక పుంజులు పందెం మానేసి పెట్టల వెనకాల పరిగెత్తేవి. ఒక పుంజు పెట్టపైకి ఎక్కింది. దాని కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని పెట్ట చనిపోయింది. ఊళ్ళో పెద్ద గొడవైపోయింది. ఆ పెట్ట చనిపోగానే నాకు భలే బాధేసింది. అందరూ నన్నే ఆడిపోసుకున్నారు. అందుకే వాళ్ళు కోడి పందేలు వేసినట్టు మా పిల్ల గ్యాంగుతో కలిసి దడుల/కంచె మీదున్న తొండలను పట్టుకుని, వాటి మెడకు తాళ్ళు కట్టి పందేలు వేశాం. అది తెలిసి మా బాబాయ్ పరిగెత్తించి పరిగెత్తించి కొట్టాడు. అంతటితో దానికి పుల్ స్టాప్ పడింది.

ఊరికి తూర్పు వైపున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పడమర వైపున మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలున్నాయి. బుద్ధిగా పాఠశాల కెళ్ళడం మొదలెట్టాను. అక్కడ కూడా మా పిల్ల గ్యాంగ్ అల్లరి ఆగలేదు. గాలి వానలకు తోటల్లో మామిడికాయలు రాలిపోయి పిల్ల కాలువల ద్వారా చెరువులోకి చేరేవి. ఆ చెరువుకు ఆనుకుని ఉండే మండల పరిషత్ పాఠశాలలో ఉన్న మేము, మాష్టారుకు తెలీకుండా వెళ్లి చెరువులో కాయలు తీసుకుని తినేవాళ్ళం. వర్షానికి ఎదురేళ్ళిన చేపలు, వర్షం వెలిశాక తిరిగోస్తున్నప్పుడు వలలతోనూ, గాలాలతోనూ బడి మానేసి పట్టుకుని సంబరపడేవాళ్ళం. పదోతరగతికొచ్చినా నిక్కర్ వేసుకునే పాఠశాలకు వెళ్ళాలంటే సిగ్గేసేది. ప్యాంట్ కొనిస్తేనే వెళ్తానని మారాం చేసి బడి మానేసి కూర్చున్నప్పుడు నాన్నగారు ఈతకర్ర పట్టుకుని కొట్టుకుంటూ తీసుకెళ్ళాడు. అది చూసిన స్నేహితులందరూ ఒకటే నవ్వు. అప్పటిదాకా గ్యాంగ్ లీడర్ గా ఉన్న నా పరువు మొత్తం పోయిన ఫీలింగ్ కలిగింది. ఆ సంఘటన నేనెప్పటికీ మర్చిపోను. గ్రామానికి ఆనుకునున్న చెరువు ఆధారంగా పొలాలు సాగుబడిలో ఉన్నాయి. విద్యుత్ అంతరాయం కలగకుండా 33/11 కేవి విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.

చూడ్డానికి చిన్నూరైనా చుట్టూరా పొలాల్లో నిత్యావసర సరుకులు టమోటా, మిర్చి, మినుములు, దోసకాయలు, బీరకాయలతో పాటుగా వాణిజ్య పంటలైన చెరుకు, పత్తి, పామోలిన్, వేరుశెనగ, జామ కాయలతో పాటు దేశం మొత్తం ప్రాచుర్యం పొందిన నూజివీడు మామిడి పుష్కలంగా పండుతుంది. నూజివీడు మామిడి పండేది మా గ్రామంలోనని చాలామందికి తెలీదు. చాలా దగ్గరున్న నూజివీడు పట్టణం రవాణా సౌకర్యానికి అనువుగా ఉండడంతో అక్కడినుంచే ఎగుమతి చేసేవారు. దాంతో క్రమంగా నూజివీడు మామిడి అనే పేరు స్థిరపడిపోయింది. నూజివీడును ‘మేకా’ రాజ వంశస్థులు బాగా పరిపాలించారు. వారు కట్టించిన కోటలు, చెరసాలలు ఇంకా దృఢంగా ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చాక ‘ధర్మా అప్పారావు కళాశాల’ను ఏర్పరిచి వారి కోటలను తరగతి గదులుగా మార్చేశారు. మామిడి మార్కెట్ కెళ్ళినప్పుడు గుర్రం గేటు, కుక్కల గేటు, చిన్న గాంధీబొమ్మ సెంటర్ ఖచ్చితంగా చూసొచ్చేవాళ్ళం.

ఇటు పక్కనే ఉన్న హనుమాన్ జంక్షన్ పట్టణం కూడా మరింత ప్రసిద్ధిగాంచినది. ఊళ్ళో దొరకని ప్రతి వస్తువూ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హనుమాన్ జంక్షన్లో దొరికేవి. హనుమాన్ జంక్షన్ పేరుతో జగపతిబాబు, అర్జున్ హీరోలుగా సినిమా వచ్చింది. ఆ సినిమా బాగా ఆడడంతో మా ప్రాంతం పేరు మార్మోగింది. మా దగ్గర వంద రోజులు ఆడడంతో హీరోలిద్దరూ వచ్చి థియేటర్ యజమానికి కారును బహుమతిగా ఇచ్చారు. ఆరోజు ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. వాళ్ళను ఎలాగైనా చూడాలని నా స్నేహితుడిని ఎక్కించుకుని సైకిల్ వేసుకుని జంక్షన్ వెళ్లాను. ఎంత ప్రయత్నించినా వాళ్ళ మొహాలు కనిపించలేదు. నిరాశగా తిరిగొస్తుంటే అప్పుడే కారు ఎక్కి వెళ్లబోతుండగా చూశాం. సైకిల్ మీదున్న మమ్మల్ని చూసి చేయి ఊపారు. ఇక మా ఆనందానికి అవధుల్లేవు. ఊళ్ళో చెప్పి పెద్ద డాబు ప్రదర్శిద్దాం అనుకునేలోపు మా పెదనాన్న మమ్మల్ని చూసేశాడు. ఎవ్వరికీ తెలీకుండా వచ్చాం అనుకున్న మాకు ఆయన చూడగానే భయంగా తిరుగు ప్రయాణమయ్యాం. ఆ హడావుడిలో సైకిల్ తొక్కుకుంటూ వస్తుంటే పడిపోయాం. దెబ్బలు తగిలాయి. తర్వాత మా పెదనాన్న హీరో కృష్ణ గారి సినిమా వజ్రాయుధం శ్రీనివాస ధియేటర్లో వందరోజులు ఆడినప్పుడు కూడా ఇలాగే జరిగిందని, అప్పుడు ఆయన కూడా ఇలాగే దొంగచాటుగా వచ్చి చూశాడని చెప్పాడు. కానిప్పుడు ఆ ధియేటర్ స్థానంలో కళ్యాణమండపం వెలసింది. పెదనాన్న మా గురించి ఇంట్లో చెప్పనందుకు ఊపిరి పీల్చుకున్నాం. మా మోకాళ్ళు కొట్టుకుపోవడంతో అమ్మ చాలా బాధపడింది. 

హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం చాలా ప్రసిద్ధి. అప్పట్లో నూజివీడును జమిందార్ మేకా వెంకటాద్రి బహద్దూర్ గారు పరిపాలించేవారు. ఓ రోజు వేటకు అడవిలోకి వెళ్ళాడట. కొద్దిసేపటికి బాగా ఆకలి వేయగా ఏమీ దొరక్క చూస్తుండగా ఓ కోతి అరటిగెల తీసుకొచ్చి ఆయన ముందు పడేసిందట. ఆ క్షణంలో కోతిని చూసిన రాజా వారికి ఆనాడు దండకారణ్యంలో శ్రీరాముడికి ఆకలి వేయగా, ఆంజనేయస్వామి వచ్చి అరటి పండు ఇచ్చి స్వామి ఆకలి తీర్చిన సంగతి స్ఫురించిందట. వెంటనే ఆ ప్రదేశంలో (ఇప్పుడున్న నాలుగురోడ్ల కూడలిలో) పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, గుడి కట్టించాడు. అందువలనే విగ్రహంలో స్వామివారి తోక అరటిగెలను పట్టుకుని, హస్తం అభయమిస్తున్నట్లుగా ఉండడం విశేషం. ఈ విగ్రహం కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలకు సరిహద్దులో ఉంది. స్వామి పాదాలు రెండు జిల్లాల సరిహద్దులో ఉంటే గర్భగుడి పశ్చిమ గోదావరి జిల్లాలో, మెట్లు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. స్వామి విగ్రహం ముఖంలో వానర లక్షణాలకంటే మానవ ముఖం లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. కారులోనో, బస్సులోనో వెళ్తూ, ఆ విగ్రహానికి నమస్కారం చేయకుండా ఎవ్వరూ వెళ్ళరు. ఎంతో మంది రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రెటీలు ఖచ్చితంగా ఇక్కడ పూజలు చేశాకే కార్యాలు మొదలెట్టిన సంఘటనలెన్నో ఉన్నాయి. 

          గ్రామం చివరన చెరువుకు ఉత్తరం వైపున మోహన్ స్పింటేక్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ & విజయ్ కుమార్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలు రాకతో గ్రామంలో చాలామందికి ఉపాధి లభిస్తోంది. మోహన్ స్పింటేక్స్ దగ్గరో ఏటియం, పక్క ఊరు రేమల్లెలో విజయా బ్యాంకు అందుబాటులోకొచ్చాయి. ఉదయం ఆరున్నర గంటలకు హనుమాన్ జంక్షన్ నుండి వేలేరు, రేమల్లె, సింగన్నగూడెం, మల్లవల్లి, వట్టిగుడిపాడు గ్రామాల మీదుగా నూజివీడు చేరుకునే బస్సు సర్వీస్ ఒకటి మాత్రమే ఉన్నది. సాయంత్రం ఐదున్నర గంటలకు నూజివీడు నుండి అవే గ్రామాల మీదుగా బస్సు సర్వీస్ ఉన్నది. కళాశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం ఏపిఎస్ ఆర్టిసి (APSRTC) ప్రత్యేకంగా నడుపుతున్నది. ప్రయాణాలకు ఎంత మాత్రం ఇబ్బంది లేకుండా హనుమాన్ జంక్షన్ నుండి రేమల్లె & మల్లవల్లి వరకు, మరలా మల్లవల్లి నుండి నూజివీడు వరకు ఆటోల సర్వీస్లు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి.

          ఊరు గురించి చెప్తుంటే ఎన్నో జ్ఞాపకాల దొంతరులు దొర్లిపోతున్నాయి. కొన్ని కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చి గుండెలోతుల్లో తడి అవుతుంది. వేసవికాలం తాటిముంజల కోసం మామిడి తోటల వెంట వెళ్లి, తాటిముంజలు కాకుండా యజమానికి తెలీకుండా మామిడి పళ్ళు కోసుకుని దొంగచాటుగా తినడం గుర్తొస్తుంటే నోరూరుతుంది. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా గ్రామ రహదారుల వెంట నాటిన మొక్కలు ఇప్పుడు పెద్ద వృక్షాలుగా ఎదిగిన తీరు చూస్తుంటే వాటితో నాకున్న అనుబంధం గతస్మృతుల్ని తడుముతుంది. ఇలాంటివెన్నో మరపురాని మధురస్మృతుల లోగిలిలో బందీనయ్యాను.*

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనల కోసం...